Sunday, September 27, 2009

గణేష్ - ఓ మాదిరి గా నచ్చాడు







"సినిమా అంటే ఉన్నంతసేపూ ఎంటర్టెయిన్ చెయ్యకపోయినా ఆసాంతం విసిగించకుండా ఉంటే చాలు అనుకునే క్యాండిడేట్‌ని నేను ... ఈ కారణం వలనే నచ్చి ఉంటాడు ఈ గణేష్"


కథ క్లుప్తంగా - ఏమీ లేదు ...


అంటే చెప్పుకునేంత ఏమీ లేదు అని ...


సరే సరే ఒక లైనులో ... "ప్రేమికులైన ఫ్రెండ్సు కి పెళ్ళి చెయ్యడానికి హీరోయిన్ ని ప్రేమించినట్టు నటించాలనే(అవసరం లేదు కానీ సినిమా కోసం తప్పలేదు) వింత ప్రయత్నం లో ఆ హీరోయిన్ని నిజంగా ప్రేమించి, తర్వాత నిజం తెలిసిన హీరోయిన్ని ఎలా కన్విన్స్ చేసాడు" ... అంతే


కథ ఎలా నడిచిందంటే:
అలా హీరోయిన్ ని లైన్ లో పెట్టడానికి వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్ళిన హీరో గారికి అక్కడ ఒక చిన్న వానరమూక ఎదురవుద్ది ... వారిని ఎలా convince చేసి హీరోయిన్ కి దగ్గరయ్యాడు అనేది మొదటి భాగమ్. రెండో భాగం అంతా మనసు విరిగిన హీరోయిన్ ని హీరో convince చెయ్యడం గురించి ఉంటుంది.


3 వంతుల సినిమా(3వ వంతు వరకూ) బాగుంది ... చివరాఖరి వంతు డ్రాగింగ్ ఉంది కానీ పర్లేదు లాగించెయ్యొచ్చు. మొదటి సగం లో పిల్లలతో చేసిన అల్లరి చాలా బాగుంది. పిల్లల చేత డబుల్ మీనింగ్ డైలాగ్స్, లవ్ ఎఫైర్స్ నడుపుతున్న ఈ కాలంలో ఇలా పిల్లల్ని పిల్లల్లా, వాళ్ళ అమాయకత్వాన్ని హైలెట్ చేస్తూ చూపించిన తీరు బావుంది. వాళ్ళ అల్లరికి మొదటి సగం అసలు టైమే తెలియలేదు. వాళ్ళ అల్లరిలో ప్రేమ సన్నివేసాలు కూడా తలకెక్కలేదు. హీరోయిన్ ని లవ్ లో పడెయ్యడానికి మన హీరో గారి కొత్త ట్రాక్ బాగుంది. మధ్యలో ఒక రౌడీ గ్యాంగ్ కూడా ఉంది.


రెండో భాగం లో విడిపోయిన ప్రేయసిని convince చెయ్యడానికి 5 ని॥ టైం అడగడం, దానిలో ఒక్కొక్క నిమిషం తీసుకోవడం సరదాగా సాగిపోయింది. ఆ 5 ని॥ అయ్యిన దగ్గర్నుంచీ మత్రం బుర్ర తినేసాడు. కానీ మరీ తల బాదుకునేంత మాత్రం కాదు.


పిల్లల ఎపిసోడ్స్ బాగున్నాయి. రెండవ భాగం లో కూడా వారి నిడివి పెంచుంటే బాగుండేదనిపించింది.


హీరో- రాం: మొదటి సినిమా లో లాహిరి లహిరి లాహిరి లో లో ని ఆదిత్య లా కనపడ్డాడు. కానీ ఆ ఓవర్ యాక్టింగ్ తగ్గించాడు చాలా వరకూ. హడావుడి లేకుండా నెమ్మదిగా మాటాడుతూ బాగా నచ్చేసాడు. ఆ 5ని॥ల సన్నివేశాలలో పవన్ ని ఇమిటేట్ చేసాడా లేదా అన్నది పక్కన పెడితే మస్తు ఎంజాయ్ చేసాను నేనైతే వీడి కామెడీని. సీరియస్ సన్నివేశాలు కూడా మన చేత బ్రహ్మం expressions పెట్టనీయకుండా ఆకట్టుకున్నాడు. చాలా improvement మునుపటి సినిమాలతో పోలిస్తే. డ్యాన్సులు ఇరగదీస్తున్నాడు. ఫైట్లు చాలావరకూ వైర్లు వాడుతున్నాడు. ఇలాంటి సినిమాల్లో ఓకే కానీ అన్నిటిలో అదే అంటే కష్టమే! ... ఓవరాల్ గా నచ్చాడు ...


కాజల్ - ఈ సినిమా కి స్పెషల్ ఎఫెక్ట్స్ లాంటిది. మగధీర మ్యానియా తర్వాత కనపడిందేమో భలే ఉంది . అక్కడక్కడా భయపెట్టినా బాగా చేసింది. ఖుషి సినిమా లో భూమిక తరహా పాత్ర తనది. అంత కాకపోయినా బాగుంది.


పిల్లలు - వీళ్ళ వలనే సినిమా. పేర్లు తెలీవు కాబట్టి ... ఇలా చెప్పుకుందాం. హీరో ని నిజం గా నే హీరో అనుకునే అమాయకపు కళ్ళజోడు కుర్రాడు, అది అబద్దమని గట్టిగా నమ్మే లీడర్ గా చేసిన బొద్దు కుర్రాడు, ట్యూషన్ తప్పించుకోడానికి 70% మార్కులు తెచ్చుకుంటానని పందెం కాసిన బుడతడు, ప్రపంచపు మొదటి సూపర్ వొమన్ అవుతాననే ఇంకో పాప ... అందరూ ఇరగదీసారు. వాళ్ళ యాక్టింగ్ ముందు వీళ్ళు చిన్న పిల్లల్లా కనపడ్డారు. సినిమా ఎలా ఆడినా సగం క్రెడిట్స్ వీళ్ళకి ఇచ్చెయ్యొచ్చు.


విలన్ - ఆశిష్ విద్యార్థి ... పెద్ద స్కోప్ లేదు కానీ అదో కామెడీ ట్రాక్. బ్రహ్మానందంతో హీరో చేసే అల్లరి కూడా బాగుంది. విలన్ పాత్రని సినిమాలో క్రూరంగా చూపిస్తూనే సడెన్‌గా కామెడీ చేసేసాడు. ఆ పాత్ర నాకు బానే సెట్ అయిందనిపించింది. పిల్లల దగ్గర హీరో ని హీరోని చెయ్యడం ఈ పాత్ర ముఖ్యోద్దేశ్యం కావొచ్చు.


పూనం కౌర్, రోహిణి హట్టంగడి, ఇంకా చాలామంది ఉన్నారు. చెప్పుకోవలసినది ఏమిటంటే ఎవరూ ఎక్కువ యాక్టింగ్ చెయ్యలేదు. అంటే ఎవరూ వాళ్ళ యాక్టింగ్ తో విసుగు తెప్పించలేదు అని.


సంగీతం, పాటలు, మాటలు: పాటలు అంతగా ఎక్కలేదు. కొన్ని కొన్ని పాటలు చాలా చిరాకు తెప్పించాయి. మంచిగా వెళుతున్న సినిమాలో అసహనానికి గురి చేసాయి. చాలా వరకూ ఎవాయిడ్ చెయ్యదగినవే. రెండు పాటల్లో మంచి స్టెప్స్ వేసాడు రాం. చాలా కష్టపడుతున్నాడు డ్యాన్స్ విషయంలో. మాటలు వచ్చి పిల్లల పంచ్ డైలాగ్స్, హీరో-హీరోయిన్ల మధ్య సంభాషణలు బాగున్నాయి. కోట్ చేసేంత అంటే ఒక్క డైలాగ్ ఉంది - "క్షమించగలిగేవాళ్ళే ఎక్కువ ప్రేమించగలరు".


డైరెక్షన్ బాగానే ఉంది. పాత పచ్చడినే కొత్తగా చేసి వడ్డించడం తెలిసిన దర్శకుడే. మొత్తమ్ సినిమా అంతా ఎక్కడో చూసినట్టే ఉంటది. కానీ కొత్తగా ఉంటుంది. అది చాలు నాలాంటి సగటు ప్రేక్షకుడికి. హీరో చివరికి చేతులు కోస్కోవడం ఒక్కటి తక్క ఎక్కడా చెత్త పోకడలకి పోలేదు. రెండవ భాగం అంత డ్రాగ్ చెయ్యకుండా ఉంటే ఇంకా బావుండేది. ఆ విలన్ గ్యాంగ్ ని చివర్లో కొంచెం కామెడీ టచ్ తో అంతం చేసుంటే బాగుండేది ... ఇలా కూడా బానే ఉందనుకో!


ఓవరాల్ గా సినిమా ఒకసారి చూడగలిగిన సినిమా. చిన్నపిల్లలకి, చిన్నపిల్లలు నచ్చేవారికీ, లాజిక్స్ వెతక్కుండా చూసేవారికీ ఈ సినిమా నచ్చి తీరుతుంది. తప్పకుండా చూడండి మరి :-)


Total movie score: 80/100 ... (Ram-90/100, Kajal-70/100,పిల్లలు - 100/100 ) 

Source: ఆంధ్రాఫోక్స్

Monday, September 21, 2009

బాణం






బాణం: ఎక్కు పెట్టడం మర్చిపోయారు :P

ఏటి వీడు అందరూ రివ్యూస్ సూపర్ అంటూంటే ఇలా అంటున్నాడు అని తిట్టుకుంటే నేనేమీ చెయ్యలేను ... ఎందుకంటే నేనూ ఆ రివ్యూస్ చదివే సాహసించాను, ఈ సినిమాతో నా వీకెండ్ ని బుగ్గిపాలు చేస్కున్నానన్న కసితో ఈ పోస్టు ...

సినిమా కథ - ఒక నక్సల్ తండ్రి, తన తండ్రి చేస్తున్న ఉద్యమం మంచిదే కానీ అది పోలీస్ అయి కూడా చెయ్యొచ్చు అనుకునే కొడుకు ... ఇంతే ... ఏమిటి స్టోరీ కేక ఉంది ... మంచి సందేశం ఉంటుంది అని డిసఈడ్ అయ్యారా ... మరి అదే తొందరంటే ... సినిమా అంతా పోలీస్ గా చెయ్యొచ్చు అనుకుంటూనే ఉంటాడు, కానీ చెయ్యడు ... చివరికి అన్నా చేసాడా లేదా అన్నది నేను చెప్పను సస్పెన్స్(కింద చదివితే ఆ సస్పెన్స్ కూడా రివీల్ అయిపోద్ది)

ఆ నక్సల్ తండ్రి గా షియాజీ షిండే నటించగా, కొడుకు గా నారా రోహిత్ నటించాడు ... స్టోరీ చూసి అమ్మో షియాజీ కి ఇంత పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారా అనుకుని భయపడకండి, అంతా ఉత్తుత్తినే ... ఏదో 2-3 డైలాగ్స్ ఆ వెరైటీ(చెత్త) యాసతో మనల్ని హింస పెట్టడం తో అయిపోతుంది తన క్యారక్టర్. అదేంటీ స్ట్రోరీ లో తండ్రి, కొడుకుల మధ్య ఏదో సంఘర్షణ లా చెప్పావ్ అని అనమాకండి ... నాకూ అదే అర్థం కాలేదు ఏమి చెప్పాలనుకున్నాడో!! :(

హీరో నారా గారు - ఇంట్రో సాంగ్ కేక ... అందరి మొహాలలో నవ్వుల పువ్వులు పూయించాడు ... కాసేపటికి చిరాకు పుట్టించాడు ... పాట మొత్తం జాగింగ్ చేస్తూనే ఉన్నాడు ... ఆ జాగింగ్ కూడా గట్టిగా నడిస్తే కాలుజారి పడుతానేమో అనే ఫేస్(సేఫ్) ఎక్స్‌ప్రెషన్ తో పరిగెడుతుంటే ... అ థ్రిల్ మీరు స్వయంగా చూడాల్సిందే ... చెప్పడానికి వర్ణనాతీతం. అలా మొదలెట్టిన పరుగు కాస్త నడక గా, నత్త నడక గా మారి చివరి వరకూ సాగింది. హీరో యాక్టింగ్ గురించి మాటాడకుండా నడక, పరుగు అంటున్నాడేంటీ అని ఎవరూ నన్నడగొద్దు, నాకు కనపడింది నేను చెబుతున్నా అంతే. అలా నడిచే క్రమంలో కొన్ని సీన్స్ లో ఒక చిన్న స్మైల్, 2-3 కత్తి లాంటి డైలాగ్స్, 2 మనకి కనపడే ఫైట్లు, మరో 2 డైరెక్టర్ కి కనపడే ఫైట్లు, ఇంకో 2 నడక సాంగ్స్ చేసెయ్యడంతో హీరో గారి టైం అయిపోయింది. వాయిస్, డైలాగ్స్, తెలుగు వాచకం ఇవి చాలా బాగున్నాయి(డబ్బింగ్ ఆర్టిస్ట్ కి ఉండాల్సిన లక్షణాలు కదా ఇవి). ఇవి తక్క హీరో గారిలో హీరో అనిపించే లక్షణాలు అంటే మనిషి బాగున్నాడు, మంచి ఎత్తు, ఎరుపు రంగు, ... ఏమో ఇవన్నీ హీరో లక్షణాలేనా? .. ఏమిటో అంతా కంఫ్యూజన్. ఒకటి మాత్రం చెప్పగలను, సింధూరం లో బ్రహ్మాజీ నాకు చాలా నచ్చాడు తినతో పోలిస్తే(సేం క్యారెక్టర్ కదా అని కంపేరిజన్) ... హీరోకి ఈ సినిమాలో పాస్ మార్కులు కూడా ఇవ్వడం కష్టం

హీరోయిన్ వేదిక - పాపం పుట్టెడు బాధలో ఉంటది, కొన్ని పీత కష్టాల నుంచి హీరో గారు కాపాడతారు. బాగా చేసింది అమాయకంగా. హీరో-హీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని సన్నివేశాలు అదరహో రేంజిలో ఉన్నాయి. హీరోయిన్ పాత్రకి పెద్ద ప్రాధాన్యం లేదు. హీరో క్యారక్టర్ ని ఎలివేట్ చెయ్యడానికి ఉపయోగపడే పాత్ర అంతే! ... so ఉన్నంతలో సినిమాలో నచ్చింది ఈ అమ్మాయే :D

విలన్ - పేరు తెలీదు(కానీ ఎక్కడో చూసిన గుర్తు) ... కన్నతండ్రినే చంపగలిగేంత కృఊరత్వం నిండిన పాత్ర ... నవతరం రావుగోపాలరావు(ఇన్స్పిరేషన్ తీసుకున్నాడనిపించింది)లా చేసాడు. కొన్ని చోట్ల బాగున్నా, చాలా చోట్ల నవ్వించాడు. తిను ఎందుకు సినిమాకి విలనో నాకు అర్థం కాలేదు ... స్టోరీతో కనెక్షన్ లేదు ...
భానుచందర్, రాజీవ్ కనకాల కూడా ఉన్నారు ...

మాటలు, పాటలు, సంగీతం - మణిశర్మ అందించిన BGM one of his best అనుకోవచ్చు. పాటలు కూడా వినబుల్‌గా ఉన్నాయి. పాటలలో సంగీతం కంటే లిరిక్స్ చాలా బాగున్నాయి. హీరో, విలన్ నోటి వెంట వచ్చిన గంధం గారు రాసిన డైలాగ్స్ బాగా ఉన్నాయి. కొన్ని కొటేషన్స్ లా కొన్ని సందేశాల్లా, మరి కొన్ని సాగతీతగా బాగా ఉన్నాయి ...

డైరెక్షన్ - ఇందాక అన్నట్టు హీరో-హీరోయిన్ల మధ్య సన్నివేశాలు బాగా తీసాడు ... RGV స్కూలేమో ... చాలా సీన్స్ లో ఆ మార్క్ కనపడింది ... కొంతమంది ఏకలవ్య శిష్యుల్లా కాక బాగా రాబట్టగలిగాడు output. 1989 టైమ్ సినిమా కదా, దాని కోసం కొంచెం కష్టపడ్డాడు ... చాలా సీన్స్ లో డైరెక్షన్ కంటే BGM డామినేట్ చేసింది ... కానీ ఇలా కొన్ని సీన్స్ కోసం సినిమా చూడాలంటే కష్టం కదా. అంత సీరియస్ మూవీలో జోక్ అనేది వెయ్యకుండా తన డైరెక్షన్ తో నవ్వించడం అంటే అది సామాన్యం కాదు ... (సాధారణంగా బాలయ్య సినిమాలకి ఇలా జరుగుతుంటది.) ... esp.ఆ ట్రైన్ స్టేషన్ లో సీన్ :P

చాలా రివ్యూస్ రియలిస్టిక్ గా ఉన్న సినిమా నిజాయితీ తో తీసిన సినిమా అని అంటుంటే నిజమని ఫీల్ అయిన నాకు సినిమా చూస్తున్నంత సేపూ ఆ రెండు పదార్థాలు కానరాక తెగ చాలా uneasy గా ఫీల్ అయ్యాను(అంతకు ముందే తిన్న శరవణాభవన్ సాంబార్-ఇడ్లీ ప్రభావం కూడా కొంత ఉండి ఉండొచ్చు, లేదా థియేటర్ కి వెళ్ళినా నన్ను వదలని నా నల్లి ఫ్రెండ్స్ ప్రేమ వలన కూడా అయి ఉండొచ్చు) ...

సినిమా చాలా హానెస్ట్ గా తీసినది అని అన్ని రివ్యూస్ అంటున్నాయి ... నాకు అలా కనపడలేదు. హానెస్ట్ అంటే సినిమాకి ప్రాణమయిన "పోలీస్-నక్సల్" పాయింట్ మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు ...కానీ అది కాక మిగతావాటి మీద ఎక్కువ concentration చేస్తే అది హానెస్ట్ ఎటంప్ట్ ఎలా అవుద్ది? ... సినిమా మొదలయ్యిన దగ్గర్నుంచీ ఎక్కడన్నా పాయింట్ మీద మాట్లాడుతున్నారా అని చూసా ... 2-3డైలాగ్స్ తక్క ఎక్కడా కనపడలేదు. పోనీ చివరలో అయినా ఏమన్నా ఆ దిశగా వెళుతున్నాడా ఆని చూస్తే అదీ లేదు ... సిస్టం ని క్లీన్ చెయ్యడానికి తన అభిమతానికి పూర్తిగా వ్యతిరేక దిశలో వెళతాడు. ఇంకేం హానెస్ట్ మూవీ ఇది? ... సినిమా లో హీరో పాత్రని చాలా ఇంప్రూవ్ చెయ్యొచ్చు కానీ దద్దమ్మ లా కూర్చోపెట్టాడు పక్కన ... డ్యాన్స్, ఫైట్స్ చెయ్యకుండా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నాడని మెచ్చుకుంటున్నారు ... యాక్టింగ్ కూడా చెయ్యలేదనే విషయాన్ని మర్చిపోయారు మన రివ్యూయర్స్ ... ఇంకా రియలిస్టిక్ అని కూడా అన్నారు ... అది ఇంకా పెద్ద కామెడీ. సినిమా నత్త నడక నడుస్తూ అందరూ నీరసంగా మాటాడితే అది రియలిస్టిక్ అనుకోవాలేమో ... షియాజీ కనిపించే మొదటి సీన్ నుంచి చివరకి హీరో అందరినీ ఏరిపారేసే సీన్ వరకూ ఎక్కడా సహజత్వం కనపడదు. దర్శకుడిగా తనకి 80/100 ఇవ్వొచ్చు కానీ ఓవరాల్ గా సినిమాకి 50 కంటే ఎక్కువ ఇవ్వలేం ...


Source: andhrafolks